ఎమ్మెల్యే బిఎల్ఆర్ కుటుంబ రాజకీయాలపై పెరుగుతున్న విమర్శలు..!

ఎమ్మెల్యే బిఎల్ఆర్ కుటుంబ రాజకీయాలపై పెరుగుతున్న విమర్శలు..!

  • ఎమ్మెల్యేను నమ్ముకుని పని చేసిన నేతలకు దక్కే గౌరవం అసంతృప్తి నా..?

  • మునిసిపాలిటీపై పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే ఉండాలన్న రాజకీయ వ్యూహమా..?

  • రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు రాజకీయంగా గడ్డుకాలంగా మారపోతుండా..?

  • సొంత పార్టీ నేతల్లో పెనుమరుగుతున్న అసంతృప్తి..!

సూర్య ప్రతినిధి, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలుకు చివరి రోజున చోటుచేసుకున్న పరిణామాలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) కుటుంబ సభ్యులు ముగ్గురు వేర్వేరు వార్డుల నుంచి నామినేషన్లు దాఖలు చేయడం, సొంత పార్టీ నేతల్లో నిగురుగట్టిన అసంతృప్తిని బయటకు తెచ్చిన పరిణామంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

ఎమ్మెల్యే సతీమణి బత్తుల మాధవి 39వ వార్డు నుంచి, పెద్ద కుమారుడు బత్తుల సాయిప్రసన్నకుమార్ రెడ్డి 40వ వార్డు నుంచి, చిన్న కుమారుడు బత్తుల గణేష్ ఈశ్వర్ రెడ్డి 28వ వార్డు నుంచి పోటీకి దిగడం ద్వారా ఒకే కుటుంబం మూడు వార్డుల్లో బరిలో ఉండటం మునిసిపల్ రాజకీయాల్లో అసాధారణ పరిణామంగా మారింది.

ఎన్నికల ముందు వరకు పార్టీ కోసం పనిచేసిన పలువురు నేతలు, కార్యకర్తలు టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్నప్పటికీ, చివరికి కుటుంబ సభ్యులకే ప్రాధాన్యం దక్కిందన్న భావన పార్టీ లోపల గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేను నమ్ముకుని పని చేసిన నేతలకు అవకాశం లేకుండా పోయింది అన్న అసంతృప్తి, ఇప్పటివరకు బయటకు రాని లోతైన విభేదాలను బయటపెడుతున్నట్టు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ అసమ్మతి ప్రస్తుతం బహిరంగంగా కనిపించకపోయినా, ఎన్నికల సమయంలో లేదా ఫలితాల అనంతరం అది పెద్ద రూపం దాల్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ ఎన్నికల్లో మునిసిపల్ చైర్మన్ పదవి మహిళా జనరల్ రిజర్వేషన్ కావడంతో, ఆ పదవిపై స్పష్టమైన లక్ష్యంతోనే ఎమ్మెల్యే తన సతీమణిని ముందుకు తెచ్చినట్టు స్థానికంగా చర్చ సాగుతోంది. చైర్మన్ పదవిపై ఇప్పటికే పలువురు ఆశావహులు ఉన్నా, ఎన్నికల తర్వాత మునిసిపాలిటీపై పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే ఉండాలన్న వ్యూహంతో కుటుంబ సభ్యులను పోటీకి దింపారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది ఒకవైపు రాజకీయ వ్యూహంగా కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలకు కూడా తావిస్తోంది.

ప్రజల్లోనూ ఈ అంశంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు స్థిరత్వం కోసం అనుభవం ఉన్న కుటుంబం చేతుల్లోనే పాలన ఉండటం మంచిదే అని అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం ఒకే కుటుంబానికి వరుస అవకాశాలు ఇవ్వడం వల్ల మిగిలిన నేతలకు న్యాయం జరగడం లేదు అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసమ్మతి రాగాలు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు రాజకీయంగా గడ్డుకాలంగా మారతాయా, లేక తన రాజకీయ చాతుర్యంతో వాటిని సమతుల్యం చేయగలరా అన్న ప్రశ్నలు ఇప్పుడు మిర్యాలగూడ రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారాయి.

మొత్తంగా చూస్తే, మిర్యాలగూడ మునిసిపల్ ఎన్నికలు కేవలం స్థానిక పాలనకే పరిమితం కాకుండా, ఎమ్మెల్యే బిఎల్ఆర్ భవిష్యత్ రాజకీయ బలాబలాలను నిర్ణయించే దశగా మారుతున్నాయి. కుటుంబ రాజకీయాలపై పెరుగుతున్న విమర్శలు, సొంత పార్టీ నేతల్లో పెనుమరుగుతున్న అసంతృప్తి, ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలు ఇవన్నీ కలిసి మిర్యాలగూడ రాజకీయాలను కీలక మలుపు వద్దకు తీసుకొచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About The Author

Thuppari Raghu Picture

Sr Crime investigation journalist 

Related Posts

Advertisement

Latest News