సేవా పేరుతో వ్యూహం... రాజకీయ లక్ష్యం వైపు ఈ ఎల్వీ భాస్కర్..!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవలి కాలంలో ఒక పేరు చర్చనీయాంశమైంది. ఈఎల్వీ ఫౌండేషన్ భాస్కర్. సేవా కార్యక్రమాల పేరిట గ్రామాల్లో చురుకుగా తిరుగుతున్న ఆయన చుట్టూ ఇప్పుడు కొత్త ఊహాగానాలు నెలకొన్నాయి. భాస్కర్ చేస్తున్న హడావిడి రాజకీయ రంగప్రవేశానికి పునాది వేస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు స్థానిక రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
గట్టుప్పల, ప్రభాత సూర్య : గట్టుప్పల మండలం తేటిపల్లి కి చెందిన ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ఇటీవల చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలు కొందరికి రాజకీయరంగు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, శుక్రవారం రాత్రి దసరా ఆత్మీయ సమ్మేళనం పేరుతో గట్టుప్పలలో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజలు, నాయకులు, బీసీ వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు.
స్థానిక వర్గాల అభిప్రాయం ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో తన పబ్లిసిటీని పెంచుకునేందుకు భాగంగా ఈవెంట్ నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన భాస్కర్ మాట్లాడుతూ, బిజినెస్ కారణంగా ఊరికి చాలా కాలంగా దూరంగా ఉన్నాను. అందరినీ కలుసుకోవాలని అనిపించి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాను అని చెప్పారు. అలాగే, అన్ని రాజకీయ పార్టీల నాయకులను స్వయంగా కలసి ఆహ్వానించాను. అవసరమైతే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యూత్ సమ్మిట్ కూడా నిర్వహిస్తాను అని తెలిపారు.
అయితే ఆయన చేపడుతున్న కార్యక్రమాలు రాజకీయ వేదికకు పునాది వేస్తున్నాయా అనే చర్చ కొనసాగుతోంది. బీసీలు వదిలిన బుల్లెట్టు అంటూ ఆయన అభిమానులు సంబోధించడం, చౌటుప్పలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించినప్పుడు ఆ దృశ్యాలకు పాటలు జోడించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఇవన్నీ బీసీ నినాదం చుట్టూ రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈవెంట్‌కు హాజరైన వారిలో ఎక్కువమంది బీసీ వర్గాలకు చెందిన నేతలు కావడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
గతాన్ని పరిశీలిస్తే, సేవా కార్యక్రమాలతో ప్రారంభించి, చివరికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేతలు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు భాస్కర్ కూడా అదే దిశగా ప్రయాణిస్తారా? లేక ఆయన సేవా దృక్పథం నిజంగా సామాజికమేనా? అన్నది సమయం తేల్చాల్సి ఉంది. ఏమైతేనేం గట్టుప్పల నుంచి మొదలైన భాస్కర్ ఫౌండేషన్ యాత్ర ఇప్పుడు జిల్లాస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రస్థానం చివరికి సేవా పథంలో నిలుస్తుందా, లేక పాలిటికల్ పథంలోకి మల్లుతుందా అనేది వేచి చూడాల్సిందే.
About The Author

Surya Telugu news, crime investigations, Telugu World news, political analysis, Telugu big stories, Telugu news daily,