#Police : చండూరులో పోలీసులపై దాడి… ముగ్గురు యువకుల అరెస్టు
చండూరు, ప్రభాత సూర్య : నల్గొండ జిల్లా చండూరులో మంగళవారం అర్ధరాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బందిపై ముగ్గురు యువకులు దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. ఇటీవల పట్టణ పరిధిలో దొంగతనాలు వరుసగా జరుగుతుండటంతో రాత్రి గస్తీని పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో కస్తాల రహదారి పరిసర ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్ దరిదాపుల్లో ముగ్గురు యువకులు మద్యం సేవిస్తూ కనిపించడంతో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు వారిని వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయితే యువకులు అహంకారంగా ప్రవర్తించడమే కాకుండా వారిలో ఒకరు కానిస్టేబుల్‌పై దూకి దాడికి పాల్పడి గాయపరిచినట్టు విశ్వసనీయ సమాచారం.
సంఘటన తరువాత ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషనుకు తరలించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు కొందరు ప్రభావశీలులు ఒత్తిడులు తెస్తున్నారన్న చర్చ స్థానికంగా జోరుగా వినిపిస్తోంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నపుడు ఆశ్రయం పోలీసులే. ప్రజా భద్రత కోసమే రాత్రింబవళ్ళు సేవలు చేస్తున్న వారికి విధుల్లో ఉన్న సమయంలోనే తూట్లు పొడిచే నిర్లజ్జపు దాడులు సమాజం మొత్తానికి ప్రమాదకర సంకేతాలు. సాధారణ గొడవలకు పాల్పడిన వారినే పోలీసులు వదలరు. మరి పోలీసులపై దాడి చేసిన వారిని ఏ స్థాయిలో శిక్షిస్తారు అనేది ఇప్పుడు ప్రజలలో ప్రధాన చర్చాంశంగా మారింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అధికారిక వివరాలు విడుదల చేయాల్సి ఉన్నది.
About The Author
