వివాదాస్పదంగా మునుగోడు కాంగ్రెస్ నేతల వ్యవహారం
-
సీఎం ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేతలు
-
సీఎంను పట్టించుకోని మర్రిగూడ కాంగ్రెస్ లీడర్స్
-
బోనాల పండగ ఫ్లెక్సీల్లో కన్పించని ముఖ్యమంత్రి ఫొటో
-
గతంలోనూ రేవంత్ బర్త్ డే వేడుకలకు దూరం
-
రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆగ్రహం
ప్రభాత సూర్య, నల్గొండ : మునుగోడు కాంగ్రెస్ నేతల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఏకంగా ముఖ్యమంత్రినే పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వన్‌సైడ్‌గా మద్దతు తెలిపే మర్రిగూడ మండలానికి చెందిన కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు రాష్ట్రస్థాయి నేతలను కూడా విస్మరించడం చర్చనీయాంశంగా మారింది.
మర్రిగూడ మండలం యరగండ్లపల్లిలో ఇటీవల బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లీడర్లు ఊరు మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల వెంకటేశ్ గౌడ్ పేరుతో ఏర్పాటు చేసిన పలు ఫ్లెక్సీల్లో రాష్ట్రస్థాయితో పాటు, లోకల్ లీడర్ల ఫొటోలు ప్రచురించారు. కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోను మాత్రం విస్మరించారు. దీంతో కావాలనే సీఎం ఫొటోను ముద్రించలేదన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి.
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడానికి సీఎం రేవంత్ రెడ్డే కారణమన్న అక్కసుతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి సైతం పలు బహిరంగ సభల్లో, వివిధ వేదికల్లో సీఎంపై తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. రాజగోపాల్‌కు మద్దతుగా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. అయితే వారి మధ్య విభేదాలు ఎలా ఉన్నా... ఏకంగా సీఎం ఫొటోనే పక్కకు పెట్టడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కారన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.
అయితే గతంలోనూ రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు మర్రిగూడ మండల కాంగ్రెస్ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఫ్లెక్సీలలో సీఎం ఫొటో లేకపోవడం పట్ల రాజగోపాల్ రెడ్డి వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి వర్గం కావాలనే సీఎం వ్యతిరేక వైఖరిని ఎంచుకుందా అనే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి.