Illegal affair: అక్రమ సంబంధాల ముళ్ల జాలంలో తేజేశ్వర్ హత్య..!

Illegal affair: అక్రమ సంబంధాల ముళ్ల జాలంలో తేజేశ్వర్ హత్య..!

జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ (32) దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ హత్య జిల్లాలోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.

కథనం ఇలా మొదలైంది... తేజేశ్వర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహ నిశ్చయం చేశారు. పెళ్లికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య అదృశ్యమైంది. అప్పటికే ఆమెకు కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉందని వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఫిబ్రవరి 16న తిరిగి ఇంటికి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడి తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్న ఒత్తిడి వల్లే స్నేహితురాలి ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. తనపై ప్రేమను నమ్మిన తేజేశ్వర్ కుటుంబ సభ్యుల అభ్యంతరాలు పక్కనబెట్టి మే 18న ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

కానీ పెళ్లి అనంతరం ఐశ్వర్య ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. పెళ్లయిన రెండో రోజే భర్తను పట్టించుకోకుండా ఫోన్‌లో గంటల తరబడి ఎవరితోనో  మాట్లాడడం మొదలుపెట్టింది. దాంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవ్వగా, అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గాలింపు చేపట్టిన పోలీసులు పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద తేజేశ్వర్ మృతదేహాన్ని గుర్తించారు. విచారణలో శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సుజాత కర్నూలు బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తుంటే, అదే బ్యాంకు ఉద్యోగితో వివాహేతర సంబంధం పెంచుకున్నట్టు తెలిసింది. క్రమంగా ఆ ఉద్యోగి ఐశ్వర్యను కూడా తన వలలో వేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య అదే వ్యక్తితో 2,000 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు కాల్ డేటా రికార్డుల్లో వెలుగుచూసింది.

ఈ అక్రమ సంబంధానికి అడ్డుగా మారిన తేజేశ్వర్‌ను హతమార్చితే అతని ఆస్తి తమకు అందుతుందని వారు పథకం రచించారు. బ్యాంకు ఉద్యోగి తన డ్రైవర్‌తో పాటు కొందరికి సుపారీ ఇచ్చి హత్యను అమలు చేయించాడు. జూన్ 17న తేజేశ్వర్‌ను ‘సర్వే అవసరంటూ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి కారులోనే కత్తులతో గొంతుకోసి చంపి మృతదేహాన్ని పారవేశారు.

ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉన్నాడు. ఐశ్వర్య, సుజాతను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దారుణం స్ధానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రేమ పేరుతో జరుగుతున్న అక్రమ సంబంధాల విషపర్వతం ఎంతటి ఘోరానికి దారితీస్తుందో మరోసారి స్పష్టమైంది.

About The Author

Advertisement

Latest News