టీచర్ యాదయ్య సహకారంతో విద్యార్థులకు మెరుగైన విద్య
తల్లితండ్రుల జ్ఞాపకార్థం డిజిటల్ విద్యకు ప్రోత్సాహం
విద్యనేర్పిన పాఠశాల ఋణం తీర్చుకుంటున్న దంపతులు
దళిత కుటుంబంలో పుట్టి..ఎన్నో సేవలకు ముందడుగు.
నల్లగొండ(ప్రభాత సూర్య):-
తాను పుట్టిపెరిగిన గ్రామంలో, విద్యను నేర్పి, ఉన్నత స్థానంలో నిలిపిన పాఠశాలకు, గురువుల ఋణం తీర్చుకునే కార్యక్రమాలు చేస్తున్నారు, రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోరెంక యాదయ్య... కోరెంక అనేది ఆయన ఇంటి పేరైనప్పటికి, ఉన్నత చదువులు ఆయనను సమాజంలో టీచర్ యాదయ్యగా నిలబెట్టింది. పుట్టింది పేద కుటుంబంలో అయినా..ఆయన పట్టుదల ప్రభుత్వ ఉద్యోగం సాధించడంలో తోడ్పాటయింది. విద్యకు పేద, కుల, మత, వర్గబేధాలు లేవని ఈయనను చూస్తే నిజమనిపిస్తుంది.
రాంరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో, చిన్నప్పటి నుండే విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలని ఆయన పూనుకున్నారు. అనుకున్నదే తడవుగా, ఆయన కుమారుల సహకారంతో, ఏఎల్ఎక్స్ ప్రోగ్రాం ప్రారంభించేందుకు ముందుకు వచ్చారు. వాటికోసం అయ్యే ఖర్చును మొత్తాన్ని భరించేందుకు సిద్దపడ్డారు. వెంటనే తన తల్లితండ్రుల పేరున కంప్యూటర్లు ఇప్పించి అందరికి ఆదర్శంగా నిలిచారు.
ఎవరీ టీచర్ యాదయ్య
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం, రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోరెంక నర్సింహ ఎల్లమ్మలకు యాదయ్య జన్మించాడు. మొదటి నుండే వీరిది పేద కుటుంబ కావడంతో, ఈయనతో పాటు అక్క రాములమ్మ, తమ్ముడు చిన్న యాదయ్యల పోషణ ఆ కుటుంబానికి మరింత భారంగా మారింది. ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటూ, ఆయన తల్లిదండ్రులు కూలి పనులు చేసుకునేవారు. పిల్లలను చదివించాలని తల్లిదండ్రులకు కోరిక ఉన్నప్పటికీ, పేదరికం వారిని వెక్కిరించింది. బ్రతుకు బండి నడవాలంటే, ఏదో ఒక పని చేసుకోవాలని.. అదే గ్రామానికి చెందిన పెద్ద వెంకట్ రావు బర్లకాడి జీతగాడిలా మారాడు టీచర్ యాదయ్య. యజమాని చేతిలో దెబ్బలు తిన్న ఆయన జీవితం, విద్యవైపు నడిపించింది. స్కూల్ కు వెళ్ళడానికి బట్టలు లేని సమయంలో, తండ్రి అప్పు చేసి మరి బట్టలు తీసుకున్న రోజులు టీచర్ యాదయ్య మరిచిపోలేదు.రెండో తరగతి రాంరెడ్డిపల్లిలో, ఐదవ తరగతి తానేదార్పల్లిలో చదువుకున్నాడు. ఆదివారం సెలవుల సమయంలో భీమనపల్లిలో మిరప కోయడానికి, గొర్లకాపరిగా మారి, ఎనమిదవ తరగతి వరకు చదువు పూర్తి చేసాడు. ఇదిలా ఉండగా ఏడవ తరగతిలో, తండ్రి మరణం తీరని దుఃఖాన్ని మిగిల్చడమే కాక, విద్యాభ్యాసం అంధకారంగా మారింది. ఎటు వెళ్లలేని సమయంలో చదువుపై ఆయన ఆసక్తి, సరస్వతి వైపు నడిపించింది.
బట్టపోతు నరసమ్మ రామలచ్చయ్యల తోడ్పాటు.
టీచర్ యాదయ్య పెద్దనాన్న కూతురు, బట్టపోతు నరసమ్మ రామలచ్చయ్యలు, ఆపై చదువులకు తోడ్పాటును అందించారు. వారి సొంత గ్రామమైన వెల్మకన్నెకు తీసుకొని వెల్లిన ఆ దంపతులు, వెల్మకన్నె హాస్టల్ లో చేరిపించారు. ఆదివారం వారివద్దే ఉంటూ, వ్యవసాయ పనులు చేసుకుంటూ వారికి సహాయంగా ఉండేవారు టీచర్ యాదయ్య. రుచి లేని, పురుగు పట్టిన అన్నంతో పస్తులు ఉన్న రోజులను, యాదయ్య ఇప్పటికి మరువలేదు. తగిన పోషణ లేక ఆరోగ్యం దెబ్బతినడం సవాళ్ళుగా మారిన రోజుల్లో చదువుకోవాలన్న తపన ఆయనను ఎన్నో కష్టాలను ఎదురుకునే శక్తిని అందించింది. 1987లో ద్వితీయ శ్రేణిలో పదవ తరగతి పూర్తి చేసి, ఇంటర్ చదువులకై, నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారు. అక్కడ కూడా కష్టాలు వెంటే వచ్చాయి. రూమ్ కిరాయిలు, తిండి, బట్ట, ఫీజులు, పుస్తకాల కోసమై కూలిగా మారిన రోజులు నెమరేసుకుంటున్నారు యాదయ్య. కిరాణం షాపుల్లో, హోటల్స్, లాడ్జీలు, ఉప్పరి పనులు చదువుకై వారు చేసిన పనులు పోరాటమనే చెప్పుకోవాలి.
కన్నతల్లి ఎల్లమ్మ దీవెనతోనే ఉన్నత చదువులు
తండ్రి లేని యాదయ్యకు తల్లి ఎల్లమ్మనే అంతాతానై చూసుకుంది. దొరల దగ్గర జీతం ఉన్న ఎల్లమ్మ, దొరికిన ప్రతి గింజ, వచ్చిన ప్రతి రూపాయి ఆయన చదుకై వెచ్చించింది. ప్రతి సారి కన్నీళ్లతో కొడుకును సాగనంపే తల్లిపడిన కష్టానికి ఋణం తీర్చుకోవాలని, చదువుపై కసి పెంచుకొని చదవసాగాడు. ఈ సమయంలో ఉపాధ్యాయులు, లెక్చలర్లు ఫీజులు కట్టి ప్రోత్సహించారు. తెలుగు పండిత శిక్షణ పూర్తి చెయ్యడానికి తన వద్ద డబ్బులు లేకపోవడంతో, ఆయన క్లాస్మెట్ అరుణ భారతి ఆర్థిక భరోసాను అందించారు. తనకు ఆయన ఎప్పటికి ఋణపడి ఉంటారనేది చిన్నమాటే. డిగ్రీలో ప్రధమ శ్రేణిలో ఆయన పట్టా పొంది ప్రధమ మెట్టును అధిరోహించారు.
1996లో ఆయన కళ సాకారం
పీజీ ఎంట్రెన్స్ లో ఉస్మానియా పరిధిలో మొదటి ర్యాంక్ సాధించిన ఆయన, పీజిని కొనసాగిస్తూనే ఉపాధ్యాయ పరీక్షలకు హాజరయ్యేవారు. ఆయన పట్టుదల ముందు, ఆశయం తలదించుకుంది. 1996 జులై 18న ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాదించాడు. తాను ఎక్కివచ్చిన పేదరికం మెట్లను, అనుభవాలుగా పేర్చుకొని టీచర్ యాదయ్యగా మారాడు. అప్పటి నుండి ఏదో ఒక రకంగా, తన వద్ద చదువుతున్న విద్యార్థులకు తోచిన సహాయం చేస్తూ, అందరికి సేవలు అందిస్తునే ఉన్నాడు.
ఆయన బాటలోనే కుటుంబం
టీచర్ యాదయ్య బాటలోనే ఆయన కుటుంబ సభ్యులు నడుస్తున్నారు.. సతీమణి పద్మావతి కూడా ఉపాధ్యాయురాలే.. భర్త యాదయ్యను అనుసరిస్తూ, అందిస్తున్న సహకారాలలో వెన్నంటే ఉన్నారు. పెద్ద కుమారుడు రోహిత్ వర్మ, బెంగుళూరులో కోలికం కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు సిద్దార్ధవర్మ ఆస్ట్రేలియాలో, ఎమ్మెస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.. కడుపున పుట్టిన పిల్లలు కూడా ఆయన మార్గంలోనే నడుస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ సందర్బంగా కోరెంక యాదయ్య మాట్లాడుతూ, మనకు అది లేదు ఇది లేదు అని వెనకడుగు వెయ్యకుండా, పట్టుదలతో పని చేస్తూ, ఏకగ్రతతో సాధిస్తే సాధ్యం కానిది ఏమి లేదని సూచించారు. నేటి యువత చెడు వ్యాసనాలకు బానిస కాకుండా, కన్నతల్లితండ్రులకు, పుట్టిన ఊరికి పేరు తెస్తూ, అందరికి ఆదర్శంగా ఉండాలని సూచించారు.
About The Author
