హైదరాబాద్ మెట్రో బుక్‌ఫెయిర్ పోస్టర్ ఆవిష్కరణ
- పోస్టర్‌ను ఆవిష్కరించిన శాసనసభ్యులు అరికెపూడి గాంధీ
- ఈ నెల 16 నుంచి 25వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన
- పుస్తకప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపు
శేరిలింగంపల్లి, సూర్య : సమాజంలో పుస్తకాల పట్ల అవగాహన పెంచాలని పి ఏ సి. చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ అన్నారు. ప్రస్తుతం సెల్‌ఫోన్‌లలో లీనమైపోయే సంస్కృతికి ప్రజలు అలవాటు పడిపోయారని, ఇటువంటి సందర్భంలో తెలంగాణ బుక్ ట్రస్ట్ ముందుకు వచ్చి రాష్ట్రవ్యాప్తంగా పుస్తక ప్రదర్శ కార్యక్రమాలను బ్రహ్మాండంగా నడిపిస్తుందని తెలిపారు.
ఈ నెల 16 నుంచి 25 వ తేదీ వరకు తెలంగాణ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో మెట్రో బుక్ ఫెయిర్ జరగనున్నదనీ అన్నారు. హైదరాబాద్‌లో జరిగే మెట్రో బుక్ ఫెయిర్‌ను పుస్తక ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బుక్ ఫెయిర్‌లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, అంతేకాకుండా, పుస్తకాల పట్ల అవగాహన అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమని పేర్కొన్నారు.
పుస్తక పఠనం అవసరాన్ని గుర్తించిన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, 1956లోనే నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుత యువతరం అంతా కూడా సెల్‌ఫోన్‌లలో లీనమైపోతున్నారని, పుస్తకాలను చదవడం ఒక అలవాటుగా మార్చుకోవాలని గాంధీ అన్నారు.
మియాపూర్‌లోని శేర్‌లింగంపల్లి నియోజకవర్గం అత్యధిక జనాభా, విద్యాసంస్థలు ఉన్నటువంటి ప్రదేశం. అంతేకాకుండా ఐటీ రంగం బాగా విస్తరించిన ప్రాంతం. అన్ని వర్గాల ప్రజలు ఉన్నటువంటి మియాపూర్‌లో బుక్ ఫెయిర్ పెట్టడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. పుస్తక ప్రదర్శనలో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత పాలుపంచుకుని బుక్‌ఫెయిర్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బుక్‌ట్రస్ట్ నిర్వాహకులు కోయ చంద్రమోహన్, ప్రైవేట్ విద్యాసంస్థల రాష్ట్ర చైర్మన్ శివరాత్రి యాదగిరి, ఏఐఎఫ్‌డీవై రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, దశరథ్ నాయక్, స్థానిక కాంగ్రెస్ నాయకులు చంద్రకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.