MLA RangaReddy : కుంట్లూరు రోడ్డుప్రమాదం దురదృష్టకరం
అక్రమ నిర్మాణాలను 24 గంటల్లో తొలగించాలి – ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
తుర్కయంజాల్, మే 22 (సూర్య ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదం ప్రాణనష్టం కలిగించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై స్పందించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రోడ్డుప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించకూడదు. ప్రజల ప్రాణాలు విలువైనవి. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి” అని పేర్కొన్నారు.
అధికారులకు కఠిన ఆదేశాలు: ప్రమాదానికి కారణమైన రహదారి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను 24 గంటల్లోపే తొలగించాలని రెవెన్యూ, మున్సిపల్, ట్రాఫిక్, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎవరు అడ్డుకున్నా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. హయత్‌నగర్ నుంచి కుంట్లూరు, పసుమాముల మీదుగా ఓఆర్‌ఆర్ వరకూ ప్రయాణించే వాహనదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. రోడ్డు భద్రతను పెంచే మార్గంలో ఒక్క అక్రమ నిర్మాణానికీ కూడ మినహాయింపు ఉండదు, అని ఎమ్మెల్యే మల్ రెడ్డి హెచ్చరించారు. ప్రాంతంలోని పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే, అధికారులతో కలిసి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు తలెత్తకుండా నివారికల పథకాన్ని రూపొందించాలని సూచించారు.