Malreddy RangaReddy : పేదింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.
విజయదశమి నాటికి గృహప్రవేశాలు జరగేలా చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే మల్‌రెడ్డి
804 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ
తుర్కయంజాల్, సూర్య ప్రతినిధి : పేదలకు ఆవాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. విజయదశమి నాటికి ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులు గృహప్రవేశం చేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని స్పష్టం చేశారు.
అబ్దుల్లాపూర్ మెట్ మండలం మరియు పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీల పరిధిలో ఎంపికైన 804 మంది లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో ఆ హామీ నెరవేరుస్తున్నాం అన్నారు.
గత 10 సంవత్సరాలుగా పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించిన మల్‌రెడ్డి. కెసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలకు ఖాళీ హామీలు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసే విధానాన్ని చేపట్టింది అని తెలిపారు.bప్రతి ఇంటికి రూ. 5 లక్షల నిధులు నాలుగు దశలలో విడుదల కాబోతున్నాయని, 66 గజాల స్థలంలో నిర్మాణం జరగాల్సిందిగా స్పష్టం చేశారు. మూడు నెలల్లోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలకు తావు ఉండకూడదు. లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకునేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అమలవుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.