తెలంగాణ బోనస్‌కు కన్నేసిన దళారులు - ఆంధ్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న ధాన్యం లారీలు పట్టివేత
తెలంగాణలో ఎంఎస్‌పీతో పాటు బోనస్ ఉండటంతో దళారులు, మధ్యవర్తులు ఆ ప్రోత్సాహాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారు ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యాన్ని లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు,
మిర్యాలగూడ, ప్రభాత సూర్య : తెలంగాణలో ప్రభుత్వం ధాన్యానికి ప్రకటించిన రూ.500 బోనస్‌ను లక్ష్యంగా చేసుకొని, ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఏడు ధాన్యం లారీలను పోలీసులు పట్టుకున్నారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడిన డీఎస్పీ కె. రాజశేఖర్ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు.“తెలంగాణలో ఎంఎస్‌పీతో పాటు బోనస్ ఉండటంతో దళారులు, మధ్యవర్తులు ఆ ప్రోత్సాహాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారు ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యాన్ని లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు,” అని డీఎస్పీ తెలిపారు.


మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని వాడపల్లి, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 100-150 లారీలు తిరస్కరించామని, అయినప్పటికీ కొన్ని మార్గాల్లో అక్రమ రవాణా కొనసాగుతోందన్నారు.శనివారం వాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఆరు లారీలు, సుమారు 2,200 బస్తాల ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. "ప్రభుత్వాన్ని మోసం చేయాలనే ఉద్దేశంతో అక్రమ రవాణాకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు.ఈ సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐలు లక్ష్మయ్య, బిక్షం, సంజీవరెడ్డి, ఏఎస్ఐ రాములునాయక్ పాల్గొన్నారు.