మున్సిపల్ కమిషనర్ కు సిఐటియు సమ్మె నోటీస్
2025 మే 20న మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్త సమ్మె
కాంట్రాక్టు విధానం రద్దుచేసి ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా నియమించుకున్న కార్మికులందరికీ పాత కార్మికుల వలె వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సూర్య, తుర్కయంజాల్ : కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్స్, అసోసియేషన్ల జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు 2025 మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొనాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి గారికి సమ్మె నోటీసు అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కిషన్ మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని అన్నారు. కోడ్స్ గనుక అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందని కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం అవుతుందని ఉద్యోగ భద్రత ఉపాధి కోల్పోతారని అన్నారు.
కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కార్మికుల స్థితిగతులు అన్నింటిని సమీక్ష చేసిన కేంద్ర కార్మిక సంఘాలు స్వాతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని ఆ పిలుపులో మున్సిపల్ కార్మిక వర్గం పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన సంక్షేమ పథకాలను మున్సిపల్ కార్మికులకు పెద్దపీట వేయాలన్నారు, కాంట్రాక్టు విధానం రద్దుచేసి ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా నియమించుకున్న కార్మికులందరికీ పాత కార్మికుల వలె వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న పట్టణ విస్తరణ కనుగుణంగా సిబ్బందిని నియమించాలని అన్నారు. ఆదివారాలు పండుగ సెలవులు కార్మికులందరికీ వర్తింపజేయాలని కోరారు.పారిశ్రామిక వివాదాల చట్టం - 1947 లోని సెక్షన్ 22 సబ్ సెక్షన్ (1) ని అనుసరించి మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీసులు జారీ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు తుర్కయంజాల్ మున్సిపల్ నాయకులు యం సత్యనారాయణ, జే ఆశీర్వాదం, బి మాల్యాద్రి, ఏ మాధవరెడ్డి మున్సిపల్ యూనియన్ నాయకులు చెక్క దయానంద్, ప్రవీణ్,సరిత,నాగమణి, తదితరులు పాల్గొన్నారు.